పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని పాణ్యం రిటర్నింగ్ అధికారి, కర్నూలు జిల్లా జేసీ నారపురెడ్డి మౌర్య వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ అనంతరం 8:30 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పాణ్యం నియోజకవర్గం కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ...... సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా పాణ్యం నియోజకవర్గానికి సంబందించిన కౌంటింగ్ రాయలసీమ యూనివర్సిటీలోని మొదటి అంతస్తు ఇంజనీరింగ్ బ్లాకులో జరుగుతుందన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 5,700 పోస్టల్ బ్యాలెట్‌లను 6 టేబుళ్ల ద్వారా రెండు రౌండ్లలో లెక్కించడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ 26 రౌండ్లలో పూర్తి అవుతుందన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు ఇతర ఎన్నికల సిబ్బంది గుర్తింపు కార్డులతోనే కేంద్రంలోకి రావాలని ఆమె సూచించారు.