తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులపాలెంలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సీఎంఆర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. దీంతో పరిశ్రమలో పనిచేస్తున్న 50 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్యూమినియం తుక్కు కరిగించే సమయంలో చిన్నపాటి గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకైనట్లు తెలిసింది. గ్యాస్ వాసనకు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. మరికొంతమంది వాంతులు చేసుకున్నారు. దీంతో వీరందరిని రేణిగుంటలోని బాలాజీ ఆస్పత్రికి తరలించారు.
50 మంది అస్వస్థతకు గురికాగా.. యాజమాన్యం వీరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించింది. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కొంతమంది కోలుకోగా.. వారిని తిరిగి పరిశ్రమకు తీసుకువచ్చారు. అయితే మరికొంతమంది పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉండటంతో రేణిగుంటలోని బాలాజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
అయితే అల్యూమినియం తుక్కును కరిగించే సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తుక్కును కరిగించే సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావటమే కారణమా.. ఇంకా ఏమైనా ఉందే అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.