ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గరపడుతోంది. జూన్ నాలుగో తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఎవరి జాతకం ఏంటో .. గెలిచి అధికార పగ్గాలు చేపట్టేది ఎవరో ఆరోజు తేలిపోనుంది. ఈ క్రమంలోనే తమ పార్టీ అధికారంలోకి రావాలని.. తమ నేత భారీ మెజారిటీతో గెలుపొందాలని పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. మొక్కులు చెల్లించుకుని తమ అభిమాన నేతపై అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. భారీ మెజారిటీతో గెలుపొందాలంటూ ఓ అభిమాని పొర్లుదండాలు పెట్టారు.
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్.. చిరంజీవికి పెద్ద అభిమాని. మెగా ఫ్యామిలీ అంటే ఈశ్వర్‌కు ఎక్కడిలేని అభిమానం. మెగా ఫ్యామిలీ బాగుండాలని ఇప్పటికే అనేకసార్లు పొర్లుదండాలు, సైకిల్ యాత్రలు చేశారు ఈశ్వర్. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ పొర్లుదండాలతో తిరుమలకు చేరుకున్నారు ఈశ్వర్. శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు పొర్లుదండాలు పెడుతూ చేరుకున్న ఈశ్వర్.. జాపాలి తీర్థంలోని ఆంజనేయస్వామిని దర్శించుకుని ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని మొక్కుకున్నారు.
హనుమాన్ జయంతి సందర్బంగా జాపాలిలోని ఆంజనేయస్వామిని దర్శించుకున్నానన్న ఈశ్వర్.. పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలవాలని కోరుకున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్ర భవిష్యత్ కోసం కేంద్రం., రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. గతంలోనూ చిరంజీవి కుటుంబం బాగుండాలని సైకిల్ యాత్రలు, పొర్లుదండాలు పెట్టినట్లు చెప్పారు. మరి పవన్ కళ్యా్ణ్ గెలుస్తారా.. కూటమి అధికారంలోకి వస్తుందా.. అనేది జూన్ నాలుగున తేలనుంది.
మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా జాపాలికి భక్తులు పోటెత్తారు. భారీసంఖ్యలో భక్తులు జాపాలిలో కొలువైన ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్థలపురాణం ప్రకారం పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలసి శ్రీ వేంకటేశ్వరస్వామిని, హనుమంతుణ్ని ఆరాధించేవారు. దీంతో హనుమంతుడు ప్రత్యక్షమై మహర్షి కోరిక మేరకు ఇక్కడ వెలిశారని స్థలపురాణం. ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా జాపాలి తీర్థంలో టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. అలాగే టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితీ.