తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం తిరుమలలో రద్దీగా ఉంది.. దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి.. రోడ్లపైనా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీంతో కొందరు భక్తులు దర్శన టికెట్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నారు.. ఆ తర్వాత అమాయకంగా మోసపోతున్నారు. టీటీడీ ఎన్నో సందర్భాల్లో.. భక్తులు దళారుల్ని నమ్మి మోసపోవద్దని చెప్పింది. ఇప్పటికీ చాలామంది భక్తులు వారిని నమ్మి మోసపోతూనే ఉన్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన భక్తులు కూడా ఇలాగే మోసపోయారు.
తమిళనాడులోని సేలంకు చెందిన మోహన్‌రాజ్ కృష్ణస్వామి తిరుమల టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఆయన తన ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల చేరుకున్నారు. ఆయన శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అక్కడ టీటీడీ సిబ్బంది వారి దగ్గరున్న టికెట్లను పరిశీలించారు.. అయితే భక్తుల తీరు అనుమానంగా కనిపించింది. వారందర్ని పక్కకు పిలిచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఎవరిచ్చారని ప్రశ్నించారు.. అప్పుడు అసలు విషయం బయటపడింది.
మోహన్‌రాజ్ కృష్ణస్వామి వీఐపీ బ్రేక్ టికెట్ల కోసం.. తిరుమలలోని బాలాజీనగర్‌కు చెందిన రాజశేఖర్ అనే దళారీని సంప్రదించాడు. అతడితో ఫోన్‌లో మాట్లాడి టికెట్లు కావాలని చెప్పాడు.. దీంతో రాజశేఖర్ టీటీడీ బోర్డులోని ఓ సభ్యుడి పీఆర్వోగా ఉన్న మరో వ్యక్తిని సంప్రదించాడు. ఆ పీఆర్వో నుంచి ఏడు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను తీసుకుని.. మోహన్‌రాజ్ కృష్ణస్వామికి రూ.28వేలకు విక్రయించాడు. రూ.3,500 దర్శన టికెట్లను ఏకంగా రూ.28వేలకు వక్రయించినట్లు తేలింది. దీంతో విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించి పోలీసులకు అందజేశారు.
అయితే దళారీ రాజశేఖర్, అలాగే టీటీడీ బోర్డు సభ్యుడి పీఆర్వో బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తే అసలు సంగతి బయటపడింది. వీరు నెలకు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు లావాదేవీలు చేసినట్లు తేలింది. రాజశేఖర్‌తో పాటూ ఆ పీఆర్వో ఇలా వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిద్దరిపై విజిలెన్స్ సిబ్బంది జరిపిన విచారణ నివేదికను పోలీసులకు అందజేశారు. దళారీ రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. భక్తులెవరూ దళారుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ విజిలెన్స్, పోలీసులు సూచిస్తున్నారు. టీటీడీ కూడా గతంలోనే భక్తులకు అవగాహన కల్పించింది.. కొంతకాలం పాటూ దళారుల బెడద తప్పింది.. మళ్లీ కొద్దిరోజులుగా ఈ మోసాలు మొదలయ్యాయి.