శ్రీశైలం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీడీపీ తరుపున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సూచించారు. శనివారం ఆత్మకూరు టీడీపీ కార్యాలయం నందు ఆ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన చూశాక కచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు రోజున వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని అన్నారు. అయినప్పటికీ టీడీపీ ఏజెంట్లు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులందరు దాదాపుగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తమకు తెలిసిందని, ఈ పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివ్వకుండా చేసేందుకు వైసీపీ ఏజెంట్లు కుట్రపడే ప్రమాదం ఉందని గుర్తుచేశారు. ఆసమయంలో టీడీపీ ఏజెంట్లు ఉద్వేగానికి లోనవ్వకుండా సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కాగా ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు పకడ్భందీగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్ కంచర్ల గోవిందరెడ్డి, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాకమూరి గిరిరాజు, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్, నాయకులు కలీముల్లా, అబ్దుల్లాపురం బాషా తదితరులు ఉన్నారు.