సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోందన్నారు. రాష్ట్రంలో విజయం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు బాగా సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. ఆదివారం కూటమి అభ్యర్థులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపాయన్నారు. కూటమి అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్‌పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలు పెట్టిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్నారు. కౌంటింగ్ రోజు అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశముందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ అశ్రద్ధ వహించొద్దని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలన్నారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa