ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోన్న బెంగళూరు.. 133 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..​!

national |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 09:41 PM

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరం గత రెండు రోజులుగా భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. మరో మూడు రోజుల పాటు గార్డెన్ సిటీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ విభాగం.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే.. బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో జూన్ నెలలో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతానికి సంబంధించిన 133 ఏళ్ల నాటి రికార్డు కనుమరుగయ్యింది. జూన్ నెలలో సగటు వర్షపాతం 110.3 మిల్లీమీటర్లు కాగా.. రెండు రోజుల్లో ఏకంగా 140.7 ఎం.ఎం వర్షపాతం నమోదుకావడం గమనార్హం. ఐఎండీ ప్రకారం.. బెంగళూరు నగరంలో 1891 జూన్ 16న ఒక్క రోజే 101 ఎం.ఎం. వర్షపాతం నమోదయ్యింది. జూన్ 2 సాయంత్రం వరకూ 111 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇది జూన్ నెలలో కురవాల్సిన సగటు కంటే ఎక్కువ.


ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బెంగళూరులో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల చెట్లు నేలకొరిగి రహదారులకు అడ్డంగా పడ్డాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, పర్పుల్ మార్గంలోని మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, సోమవారం ఉదయానికి మెట్రో సేవలను అధికారులు పునరుద్ధరించారు. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీళ్లు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా బెంగళూరులోని ప్రధాన రహదారులపై 58 చోట్ల నీరు నిలిచిపోయిందని, 39 చోట్ల చెట్లు కూలిపోయాయని ట్రాఫిక్ కమిషనర్ ఎంఎన్ అనుచేత్ తెలిపారు.


అత్యధికంగా హంపి నగర్‌లో 110.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. తర్వాత మారుతి మందిర వార్డు (89.50 ఎం.ఎం), విద్యాపీఠ్ (88.50 ఎం.ఎం), కాటన్‌పెట్ (87.50 ఎం.ఎం)‌లో అధిక వర్షపాతం కురిసింది. సోమవారం కూడా నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక, భారీ వర్షంతో బెంగళూరు ప్రజలు తమకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రభుత్వం ఏదైనా, 30 నిమిషాలు వర్షం కురిసినా సామాన్యుడు ఇబ్బంది పడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. సాధారణంగా 40 నిమిషాలకు బదులుగా ఇంటికి చేరుకోవడానికి 1.5 గంటలు పట్టిందని ఒకరు వాపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa