లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు దూసుకెళ్తోంది. బీజేపీ ఒంటరిగా మెజార్టీ సాధించకపోయినప్పటికీ.. మిత్రపక్షాలతో కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం ప్రస్తుతం దేశంలోనే తీవ్ర చర్చకు దారి తీసింది. ఎందుకంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇండోర్ స్థానం నుంచి బీజేపీ ఘన విజయం సాధించారు. ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఏకంగా 1008077 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయనకు మొత్తం 1226751 ఓట్లు వచ్చాయి.
అయితే ఇండోర్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నోటా ఉండటం గమనార్హం. ఇండోర్‌లో నోటాకు 218674 ఓట్లు పడ్డాయి. నోటా చరిత్రలోనే ఒక నియోజకవర్గంలో ఇంత భారీగా ఓట్లు పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో అత్యధిక ఓట్ల మెజార్టీతోపాటు నోటాకు అత్యధిక ఓట్లు పడిన ఒకే ఒక నియోజకవర్గంగా ఇండోర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇండోర్ నియోజకవర్గంలో మొత్తం 14 మంది పోటీలో నిలవగా.. ఎవరూ శంకర్ లాల్వానీ దరిదాపుల్లో కూడా రాకపోవడం గమనార్హం.
అయితే ఇండోర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ.. రికార్డు స్థాయి విజయం సాధించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి.. నామినేషన్ విత్ డ్రా చేసుకునే చివరి రోజు నామ పత్రాలు ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం ఎవరూ లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. ఇండోర్ నియోజకవర్గంలో బీజేపీకి కాకుండా నోటాకు ఓటు వేయాలని.. ఎన్నికల ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే నోటాకు అత్యధిక ఓట్లు పోలయ్యాయి.