కాంగ్రెస్ పార్టీ తరపున టెక్కలిలో పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కి వచ్చిన ఓట్లు 2684 మాత్రమే. నందికొట్కూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ కి 7949 ఓట్లు మాత్రం వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఆశీస్సులతో మడకశిరలో తప్పనిసరిగా గెలుస్తారని భావించిన ఆ పార్టీ అభ్యర్థి సుధాకర్ కి కూడా 17300 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నా కాంగ్రెస్ అభ్యర్థులకు సగటున 3 వేల ఓట్లు లభించాయి.
అలాంటిది చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు రికార్డు స్థాయిలో 41859 ఓట్లు లభించాయి. ఇది రాష్ట్రంలోనే అత్యధికం కావడంతో రాజకీయ పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.
ఒకవైపు తెలుగుదేశం కూటమి సునామీ, మరోవైపు వైసిపి అధికార బలం, ధన ప్రవాహం మధ్య కాంగ్రెస్ పార్టీ బలం శూన్యమైన నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ ఇన్ని వేల ఓట్లు సంపాదించారంటే అది అనితర సాధ్యం. ఇంకా చెప్పాలంటే ఆ ఓట్లన్నీ ఆమంచి వ్యక్తిగతం. ఆమంచి చరిష్మాకు ఇది అద్దం పడుతోంది. చీరాల నియోజకవర్గంపై ఆమంచికి ఉన్న పట్టుకు, ఆయన మీద జనానికి ఉన్న అభిమానానికి ఈ ఓట్లే నిదర్శనమని పరిశీలకులే విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా చీరాలపై ఆమంచి ముద్ర మరోసారి ప్రస్ఫుటమైందని వారు అంటున్నారు.