పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం నిలబడిన వ్యక్తి.. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి.. నిన్నటివరకు హేళన చేసిన నాయకులే ఆయన రాజకీయ చాతుర్యానికి జై కొడుతున్న పరిస్థితి. ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా కుంగిపోకుండా ముందుకు సాగిన నాయకుడు పవన్ కళ్యాణ్. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో జనసేన 21 స్థానాల్లో పోటీచేసింది. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నారంటూ ఎంతోమంది ఎగతాళి చేసినా.. రాష్ట్రభవిష్యత్తు కంటే తనకు ఎమ్మెల్యే సీట్లు ముఖ్యం కాదంటూ అన్ని విమర్శలను తిప్పికొట్టారు. జనసేన 21 స్థానాల్లో కనీసం 10 కూడా గెలవదంటూ వైసీపీ హేళన చేసింది. పవన్‌కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తన లక్ష్యం కోసం ముందుకు కదిలారు. దీంతో వైసీపీకి ఏపీలో నామరూపాలు లేకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు.