ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. స్పీకర్ పోస్ట్ కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రఘురామ కృష్ణరాజు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలి నుంచి వైసీపీ, జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడంతో టార్గెట్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి, ఉండి నుంచి పోటీ చేసి, గెలుపొందారు. తనకు స్పీకర్ పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రఘురామ తర్వాత ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సారి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావ్ అడుగుతున్నారని తెలిసింది. కళా వెంకట్రావు తర్వాత మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియర్ నేత ఆనం రాం నారాయణ రెడ్డి స్పీకర్ పదవిని ఆశీస్తున్నారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసిన రాంనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్ పదవి చేపట్టాలని ఆసక్తితో ఉన్నారు. ఇదే విషయం చంద్రబాబుతో చెప్పారని తెలిసింది. వీరేకాక మరో ఇద్దరు, ముగ్గురు కూడా స్పీకర్ పోస్ట్ కోసం పట్టుబడుతున్నారు.