గుంటూరు జిల్లా తుళ్లూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల విధ్వంసాల పరంపర కొనసాగుతూనే ఉంది. పోలీసు కాపలా ఉన్నప్పటికీ వారి ఎదుటే తుళ్లూరులో రెండు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అర్ధరాత్రి తుళ్లూరు తులసీ థియేటర్ వద్ద ఉన్న వైయస్ఆర్ విగ్రహం తల పగలగొట్టి కాలువలో పడవేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు వచ్చి సుత్తితో ధ్వంసం చేస్తుండగా ఎస్సీ కాలనీకి చెందిన వారు అడ్డుకొనేందుకు యత్నించగా వారిపై దాడి చేశారు. ఈ తంతు అంతా పోలీసులు కాపలాగా ఉన్నప్పుడే జరగడం గమనార్హం. ప్రశ్నించిన వారిపై విచక్షణా రహితంగా దాడులకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి తోపులాట జరిగింది. అప్పుడు తీరిగ్గా పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.