రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఈసారి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. మెరుగైన జట్టును ఎంపిక చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి కసరత్తు చేస్తున్నారు. తొలివిడతలో 9 లేదా 18మందితో మంత్రివర్గాన్ని ఏర్పరచి తర్వాత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. బాబు మంత్రివర్గంలో జనసేనకు 3 లేక 4 బెర్తులు, బీజేపీకి 1 లేదా 2మంత్రి పదవులు ఇవ్వనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఆయన చేరితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పవన్ చేరని పక్షంలో ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, పంతం నానాజీల్లో ఇద్దరు ముగ్గురికి అవకాశం రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి, డాక్టర్ పార్థసారథి, సత్యకుమార్‌లలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చని సమాచారం. టీడీపీ యువనేత లోకేశ్ మంత్రివర్గంలో చేరడం ఖరారైంది. లోకేశ్, మనోహర్ ఇద్దరూ మంత్రివర్గంలోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు సీనియర్లకు అవకాశం ఉండదని అంటున్నారు. లోకేశ్ మంత్రివర్గంలోకి రానిపక్షంలో ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులులో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా బెర్తులు ఆశిస్తున్నారు.