వైసీపీ ఘోర పరాభవంతో ఆ పార్టీ నాయకులు నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. సహకార సంఘాలు, దేవదాయశాఖ, కార్పొరేషన్‌లకు చెందిన నామినేటెడ్ పదవులనుంచి వైసీపీ నాయకులు వైదొలుగుతున్నారు. అధికారులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 252 సహకార సంఘాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. త్రిసభ్య కమిటీలతో కాలం వెల్లదీశారు. ఇది చట్టవ్యతిరేకమైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైసీపీ నాయకులతో త్రిసభ్య సంఘాలను ఏర్పాటు చేసి సహకార సంఘాలను పరిపాలించారు. జిల్లా కేంద్ర సహకార సంఘం పరిస్థితి కూడా అదే. ప్రభుత్వం నామినేట్ చేసిన నాయకులే పాలిస్తున్నారు. అధికార పార్టీల ఎమ్మెల్యే సిఫారసు మేరకే త్రిసభ్య కమిటీలను నియమిస్తూ వచ్చారు. పదవీ కాలం ముగియగానే కొత్తవారికి అవకాశం కల్పించారు. త్రిసభ్య కమిటీల పాలనలో అవినీతి చోటుచేసుకుంది. సొసైటీకి వచ్చే ధాన్యం కమీషన్‌ను పక్కదారి పట్టించారు. ప్రభుత్వనుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయలేదు. త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారు. ప్రశ్నించే సాహసం చేయలేదు. ఈవిధంగా ఐదేళ్లపాటు సొసైటీలు రాజకీయరంగు పులుముకున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలు కావడంతో త్రిసభ్య కమిటీ సభ్యులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని కార్పొరేషన్‌లోను వైసీపీ నాయకులు పదవులు తెచ్చుకున్నారు. డైరెక్టర్లుగా నియమితులయ్యారు. హీరోలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు నిధులులేక బాధపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వమే పోవడంతో ఒక్కొక్కరూ రాజీనామాలు చేస్తున్నారు. దేవదాయశాఖలోను, ధర్మకర్తల మండలి సభ్యులు రాజీనామా బాటపడుతున్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలతోపాటు దేవదాయశాఖలోని అన్ని దేవాలయాలు ఎన్నికలముందే ధర్మకర్తల మండళ్ళను ఏర్పాటు చేశారు. వైసీపీ క్రియాశీలక నాయకులకు మండళ్లలో ప్రాధాన్యత కల్పించారు. వారు అంతా తమ పదవులను వైదొలిగే ప్రయత్నంలో మునిగారు. వైసీపీ భారీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజీనామాలే ఏకైక మార్గం అంటూ కమిటీలనుంచి రాజీనామాలు చేసేందుకు కసరుత్తుచేసుకుంటున్నారు. ఇలా జిల్లాలోని అన్ని నామినేటెడ్ పదవులు ఖాళీ అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయనుంది. అదే జరిగితే మరింత అవమానకరంగా ఉంటుందని అందుకే వైసీపీ నాయకులు ముందుగానే తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.