రామోజీ గ్రూపు సంస్థల అధిపతి, మీడియా మొఘల్ రామోజీరావు ఇకలేరు. వయసు సంబంధిత అనారోగ్యంతో ఆయన శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్గదర్శి్ చిట్ ఫండ్స్ విషయంలో రామోజీరావుతో సుధీర్ఘ న్యాయపోరాటం చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రామోజీ మరణంపై స్పందించారు. రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తున్నట్టు తెలిపారు. రామోజీరావు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏ రంగంలో ప్రవేశించినా సెలెబ్రిటీ స్థాయికి ఎదిగారని కొనియాడారు.
"రామోజీరావు గారి మరణం వార్త బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి. ఆయన ఎవరితోనూ రాజీ పడకుండా పూర్తి జీవితం గడిపారు. నేను ఆయనను కలుద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశా. కానీ కుదరలేదు. రామోజీరావు ఒక ఫైటర్. ఏ రంగంలోకి ప్రవేశించినా కూడా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. దేశంలో ఇంత పలుకుబడి కలిగిన వ్యక్తిని మరెక్కడా చూడలేదు. ఆయనే లేనప్పుడు ఇంకా ఆయనపై ఫైట్ ఉండదు" అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.
మరోవైపు రామోజీరావు గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "రామోజీరావు గారి లెవల్ నాకు తెలుసు. రామోజీరావు అంత శక్తివంతమైన మనిషి ఈ ఇండియాలోనే ఎవరూ లేరు. ఏ పార్టీ అయినా.. ఏ లీడర్ అయినా ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. మన దేశంలో ఓ వ్యక్తిగా ఆయన ఎంత పవర్ ఫుల్ అనేదీ నాకు బాగా తెలుసు" అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో అభిప్రాయపడ్డారు.
మరోవైపు రామోజీరావు లేనప్పుడు ఆయనపై పోరాటం ఉండదు అని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మార్గదర్శి చిట్స్ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేశారు. సుప్రీం కోర్టు వరకూ వీటిపై పోరాటం చేశారు. తాజాగా రామోజీపై ఇక పోరాటం ఉండందంటూ ఉండవల్లి వ్యాఖ్యానించడంతో.. మార్గదర్శిపై పోరాటం ముగిస్తారా అనే చర్చ నడుస్తోంది.