రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థిక దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలిసి రామోజీరావు పార్థిక దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రామోజీరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. రామోజీరావు ఓ వ్యక్తి కాదు వ్యవస్థగా అభివర్ణించారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగారని గుర్తు చేసుకున్నారు. ఒక యుగపురుషుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్న చంద్రబాబు.. నిత్యం తెలుగుజాతి కోసం, సమాజహితం కోసం పరతపించారని కొనియాడారు.
పల్లెటూరులో సాధారణ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. నిరంతర కృషితో అసాధారణ వ్యక్తిగా ఎదిగారంటూ చంద్రబాబు కొనియాడారు. ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలు స్థాపించి ప్రజలను చైతన్యవంతులను చేశారని అన్నారు. రామోజీరావుతో తనకు 40 ఏళ్ల నుంచి పరిచయం ఉందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. బ్రతికి ఉన్నంతకాలం ప్రతి నిమిషం ప్రజల కోసం తపిస్తూ, వారికోసం పనిచేశారని.. పనిచేస్తూ చనిపోతేనే తనకు ఆనందమని ఆయన చెప్పేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తనకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు రామోజీరావు ఎంతో ధైర్యం చెప్పేవారని.. ఎన్నికల సమయంలో ఆయన ధర్మంవైపే నిలబడ్డారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
రామోజీరావు అంటే ఓ విశ్వనీయతగా పేర్కొన్న చంద్రబాబు నాయుడు.. తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అని అభివర్ణించారు. అలాంటి వ్యక్తి ఇక లేరంటే బాధేస్తోందని.. ఆయనన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు.