ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎన్డీయే కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది, ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు.. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు సైతం ప్రభావం చూపించాయి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇక అధికారంలోకి రావటంతో హామీలు అమలు ఎప్పటి నుంచి అనే చర్చ నడుస్తోంది. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైనది.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఢిల్లీ, కర్నాటక, తెలంగాణలో సూపర్ సక్సెస్ అయిన ఈ హామీని.. టీడీపీ కూడా తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది.
ఎన్నికల్లో గెలిచి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలుత అమలు చేసిన హామీ ఇదే. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని మొదటగా అమలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కొన్ని పరిమితులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నిరకాల పాస్‌లు కలిగిన వారు సుమారుగా పదిలక్షల మంది ఉండొచ్చని అంచనా. వీరిలో దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది వరకూ మహిళలు, విద్యార్థినులు ఉండొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తే రోజుకు రూ.6 కోట్ల వరకూ ఆదాయం తగ్గుతుందని అంచనా.
అయితే తెలంగాణలో పోలిస్తే కొన్ని పరిమితులతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏపీలో అమలు చేయవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. కొంతమంది దీనికి సంబంధించి ట్వీట్లు పెడుతున్నారు. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నడిచే అన్ని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఏపీలో జిల్లా సర్వీసులకే ఈ పథకాన్ని పరిమితం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అంతర జిల్లాలలో తిరిగే ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలుచేస్తారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై చంద్రబాబు ముందే క్లారిటీ ఇచ్చారంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత, మంత్రిమండలి సమావేశంలో ఏ హామీలు అమలు చేస్తారనే దానిపై క్లారిటీ రానుంది. మంత్రిమండలి సమావేశం తర్వాత ఏయే పథకాలను తొలుత అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.