ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలిపేశారు. చెత్త పన్నును తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెత్త పన్ను వసూలు చేయొద్దని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో.. కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే వసూళ్లు నిలిపివేయాలని ఈ మేరకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున వసూళ్లు చేశారు. చెత్త పన్ను వసూళ్లపై విమర్శలు కూడా వచ్చాయి.. టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆస్తి పన్ను పెంచడంతో పాటుగా చెత్త పన్ను వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. చెత్త పన్ను తమకు భారంగా ఉందని జనాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని కూటమి ఎన్నికల సమయంలో హైలైట్ చేసింది.. ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేసింది.
మరోవైపు విజయవాడలో 22 రోజులుగా చెత్త సేకరిస్తున్న ఆటోలు రోడ్డెక్కలేదు. తమకు జీతాలు పెంచాలని విజయవాడలో 22 రోజులుగా చెత్త సేకరణ ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులతో గతంలో మాదిరిగానే చెత్త సేకరణ జరుగుతోంది. ఈ అంశంపైనా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పన్నును నిలిపివేసింది.