2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సూపర్ హిట్ కొట్టింది. పోటీచేసిన అన్నిచోట్లా ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో గెలిచి వందశాతం స్ట్రైక్ రేట్ నమోదుచేశారు. ఈ క్రమంలోనే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన పవన్ కళ్యాణ్ సైతం సూపర్ విక్టరీ కొట్టారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద సుమారుగా 70 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈసారి తాను గెలవడమే కాకుండా తన పార్టీ నేతలు అందరినీ గెలిపించుకున్నారు. అయితే సినిమా హీరోగా ప్రతి సినిమాకు కోట్లలో పారితోషకం తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యేగా ఎంత జీతం తీసుకుంటారనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మనదేశంలో నెలవారీ జీతం ఉంటుంది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు అత్యధికంగా నెలకు రూ.4 లక్షలు వేతనంగా అందిస్తున్నారు. ఢిల్లీలో ఎమ్మెల్యేలకు రూ.3.90 లక్షలు, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేలకు రూ.3.65 లక్షలు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు రూ.3.40 లక్షలు జీతంగా తీసుకుంటున్నారు. దేశంలోనే అతి తక్కువగా త్రిపుర ఎమ్మెల్యేలు రూ.1.05 లక్షలను జీతంగా పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతికి వస్తే శాసనసభ్యులకు ఒక్కొక్కరికి నెలకు రూ.3.35 లక్షలు జీతంగా అందిస్తున్నారు.
ఈ విధంగానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ సైతం నెలకు రూ.3.35 లక్షలు జీతంగా తీసుకోనున్నారు. ఒక వేళ మంత్రి పదవి తీసుకుంటే వేతనం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ జీతం ఎంత అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.