రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణంపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు రామోజీతో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పేరు వెనుక రామోజీరావు ఆలోచన ఉంది.. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ వీడియోను తెలుగు దేశం పార్టీ అందరితో పంచుకుంది.. అమరావతి పేరును రామోజీరావు సూచించారంటూ చంద్రబాబు చెప్పిన వీడియోను ట్వీట్ చేసింది టీడీపీ.
'ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే, రామోజీ రావు గారు పరిశోధన చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా "అమరావతి" పేరు బాగుంటుంది అని చెప్తే, అందరి అభిప్రాయం తీసుకుని, "అమరావతి" అని మన రాజధాని పేరు పెట్టుకున్నాం : రామోజీ రావు గారి గురించి, గతంలో చంద్రబాబు గారు చెప్పిన మాటలు' అంటూ తెలుగు దేశం పార్టీ ఆ వీడియోను ట్వీట్ చేసింది. 2017లో జరిగిన తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు.
'అమరాతి పేరు వినగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను.. చాలామంది రకరకాలు పేర్లు చెప్పారు. ఆ రోజు రామోజీరావు రీసెర్చ్ చేసి ఎప్పుడూ నేను మర్చిపోలేను.. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే.. ఒక సూచన చేస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. రామోజీరావు అమరావతి పేరును పరిశీలించండి.. పేరు బావుంటుందని చెప్పారు. అందరినీ అడిగాను.. సలహాలు తీసుకున్నాను. ఆ పేరు చెప్పగానే నూటికి నూరు శాతం అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు'అంటూ చంద్రబాబు ఈ విషయాన్ని స్వయంగా ఓ సభలో చెప్పారు. రామోజీరావు మరణంతో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలు, నేతలతో కలిసి రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావుకు నివాళులు అర్పించనున్నారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు వస్తున్నారు.. ఆయన రామోజీకి నివాళులు అర్పించనున్నారు.
తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు మకుటంలేని వెలుగొందారన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారన్నారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారని.. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారన్నారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారని.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారన్నారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోందన్నారు. నందమూరి తారక రామారావుతో రామోజీ అనుబంధం ప్రత్యేకమైనదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.