ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ.. ప్రమాణ స్వీకారానికి వేళైంది. దేశానికి మూడోసారి ప్రధానిగా మోదీ.. ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గతంలో 2014 లో తొలిసారి ఎంపీగా గెలిచి.. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా గెలిచి రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి.. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ఎంత జీతం అందుకుంటారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నెలకు రూ.1.66 లక్షల జీతం అందుతుంది. ఇందులో రూ.50 వేలు బేసిక్ పే ఉంటుంది. వీటికి అదనంగా ఖర్చుల కింద రూ.3 వేలు చెల్లిస్తారు. అంతేకాకుండా నియోజకవర్గ అలవెన్సు కింద మరో రూ.45 వేలు అందుతుంది. రోజువారీ అలవెన్స్ కింద రోజుకు రూ.2 వేలు అందుకుంటారు. ఆఫీస్ ఖర్చుల కింద నెలకు రూ.6 వేలు అందుతాయి. అంతేకాకుండా ఆయన ఎంపీగా కూడా ఉంటారు కాబట్టి రోజువారీ అలవెన్సు కింద రూ.3 వేలు లభిస్తాయి. ఇంటి నుంచి బయటికి వెళ్తే రోజుకు రూ.3 వేల అలవెన్సు ఉంటుంది. వీటితో మొత్తం రూ.90 వేలు అందుతాయి.
వీటితోపాటు ప్రభుత్వ భవనాన్ని నివాస సౌకర్యం కల్పిస్తారు. వీటితోపాటు టెలిఫోన్ సహా ఇతర సదుపాయాలను మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణాల ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రధానమంత్రి రక్షణ బాధ్యతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్-ఎస్పీజీ అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి, కుటుంబ సభ్యులు కలిసి ఉండేందుకు లగ్జరీ ఇంటిని అధికారిక నివాసంగా కేటాయిస్తారు. న్యూఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్‌లో ప్రధాని నివాసం ఉంటుంది. ప్రధానమంత్రికి అధికారిక కార్లు, విమానాల్లో ప్రయాణించే వీలు ఉంటుంది. ప్రధానమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మెడికల్ సదుపాయాలు కల్పిస్తుంది. ఇక పెన్షన్ విషయానికి వస్తే.. ఎన్ని ఏళ్ల పాటు ప్రధానిగా సేవలు అందించారో దాన్ని బట్టి నెలకు ఎంత పెన్షన్ ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు.