కేంద్రంలో మరికొన్ని గంటల్లో ఎన్డీఏ సర్కారు కొలువుదీరనుంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నరేంద్ర మోదీ ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ టీమ్‌లో ఎవరుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవటంతో ఈసారి టీడీపీ, జేడీయూల మద్దతు తప్పనిసరిగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూలకు సైతం మంత్రిపదవులు దక్కనున్నాయి. ఇక టీడీపీ నుంచి ఎవరిని కేంద్ర మంత్రిపదవులు వరిస్తాయనే దానిపై క్లారిటీ వస్తోంది.
టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలిసింది. మంత్రివర్గం కూర్పు మీద కసరత్తు చేసిన బీజేపీ అధిష్టానం.. టీడీపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుతో పాటుగా, గుంటూరు ఎంపీగా తొలిసారిగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మినిస్ట్రీ.. పెమ్మసానికి సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై క్లారిటీ లేదు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారడంతో టీడీపీకి నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అలాగే లోక్ సభ స్పీకర్‌తో పాటుగా మూడు మంత్రి పదవులను కేటాయించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఆయితే మంత్రి పదవుల కేటాయింపును చంద్రబాబు.. నరేంద్ర మోదీ ఇష్టానికే విడిచిపెట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రి పదవులు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక టీడీపీ నుంచి మూడో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
మరోవైపు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు మూడోసారి ఎంపీగా గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై 3,14,107 మెజార్టీతో విజయం సాధించారు. అటు.. గుంటూరు లోక్ సభా నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య మీద 3,44,695 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.