కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరి.. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీయే సర్కారు ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనతాదళ్ (యునైటెడ్-జేడీయూ)లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే హెచ్చరికలు చేశారు. టీడీపీ, జేడీయూ తప్పనిసరిగా లోక్‌సభ స్పీకర్ పోస్టు కోరుకోవాలని ఆదిత్య థాకరే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి తన మిత్రపక్షాలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తాము బీజేపీ కుయుక్తులను చూసిన అనుభవంతో చెబుతున్న మాట అని ఆయన ‘ఎక్స్’ వేదికగా సూచించారు.
అందుకే స్పీకర్ పోస్టు తీసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతున్న పార్టీలను తాను సవియంగా కోరుతున్నట్లు యువనేత వెల్లడించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీల్చిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ‘ఎక్స్’లో టీడీపీ, జేడీయూలను ట్యాగ్ చేస్తూ.. చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘స్పీకర్ పదవి తీసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతున్న పార్టీలను నేను సవియంగా కోరుతున్నాను... బీజేపీ కుయుక్తులను చూసిన అనుభవంతో చెబుతున్నా.. సర్కారు ఏర్పడిన మరుక్షణమే ఒప్పందాన్ని ఉల్లంఘించి, మిత్రపక్షాలను చీల్చుతుంది.. మాకు ఇదే గతంలో ఎదురయ్యింది.. ’ అని ఆదిత్య థాకరే ట్వీట్ చేశారు.
ఇక, చంద్రబాబు కూడా ముందుచూపుతోనే కీలక శాఖలతో పాటు స్పీకర్ పోస్ట్‌ను కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రంలో చంద్రబాబు కీలక భూమిక పోషించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యూడీఎఫ్, ఎన్డీయే ప్రభుత్వాల్లో ఆయన చక్రం తిప్పారు. వాజ్‌పేయి హయాంలో ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు పనిచేశారు. ఆ సమయంలో స్పీకర్ పదవి టీడీపీకి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీఎంసీ బాలయోగి స్పీకర్‌గా ఉన్నారు. ఆయన 2002లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఎన్డీయే భాగస్వామిగానే టీడీపీ పోటీచేసింది. కేంద్ర ప్రభుత్వంలో చేరిన టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు మోదీ క్యాబినెట్‌లో ఉన్నారు. కానీ, 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకొచ్చారు. తిరిగి 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు.