రైల్వే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, కేంద్రంలోని మోదీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల వేగానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వందేభారత్ రైళ్ల వేగం మూడేళ్లలో తగ్గిపోయినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడయ్యింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే సామాజిక కార్యకర్త రైళ్ల వేగం గురించి ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానమిచ్చారు. వందేభారత్ రైళ్ల సగటు వేగం 2020-21లో 84.48 కిలోమీటర్ల నుంచి 2023-24 నాటికి 76.25 కిలోమీటర్లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఈ మేరకు వెల్లడించారు.
కేవలం వందేభారత్ రైళ్లే కాదు వివిధ మార్గాల్లో ట్రాక్‌ల పునరుద్ధరణ,స్టేషన్ల ఆధునికీకరణ పనులతో సాధారణ రైళ్ల వేగం కూడా తగ్గిందని తెలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ వందే భారత్ నడుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, ట్రాక్ నాణ్యతను బట్టి కూడా వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించారు. వందేభారత్ రైళ్ల సరాసరి వేగం 2020-21లో గంటకు 84.48 కి.మీ.. 2022-23 నాటికి ఆ వేగం 81.38 కిలోమీటర్లకు, 2023-24 నాటికి 76.25 కి.మీ.లకు పడిపోవడం గమనార్హం.
సెమీ-హైస్పీడ్ రైళ్లను 2019 ఫిబ్రవరి 15న తొలిసారిగా అందుబాటులోకి తీసుకురాగా.. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది ఢిల్లీ, ఆగ్రా రూట్‌లో తప్ప ఇతర మార్గాల్లో గంటకు 130 కి.మీ దాటరాదని హెచ్చరించింది. ఢిల్లీ- ఆగ్రా మార్గాన్ని అత్యాధునిక సాంకేతికతతో పునరుద్ధరించడం వల్ల ఆ మార్గంలో వందేభారత్ గరిష్ఠ వేగంతో ప్రయాణించే వీలుంది. ఈ రూట్‌లో గతిమాన్ ఎక్స్‌ప్రెస్ 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. డెహ్రాడూన్-ఆనంద్ విహార్ రూట్‌లో 63.42 కి.మీ., పట్నా-రాంచీ 62.9 కి.మీ., కోయంబత్తూర్-బెంగళూర్ మధ్య 58.11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి.
ఇక, వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చి ఐదేళ్లైనా చాలా మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీని ప్రభావం సాధారణ రైళ్ల వేగంపై కూడా పడుతోంది. ట్రాక్ సామర్థ్యంపై వేగం ఆధారపడి ఉంటుంది. ట్రాక్‌ల ఆధునికీకరణ పూర్తయితే గరిష్ఠంగా 250 కి.మీ. వేగంతో రైళ్లను నడపుతామని ఓ అధికారి తెలిపారు. కాగా, వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ ఉందని, మార్చి 31 వరకు 2.15 కోట్ల మందికిపైగా ప్రయాణించారని రైల్వే శాఖ పేర్కొంది. ‘దేశవ్యాప్తంగా మొత్తం 284 జిల్లాలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుసంధానం అయ్యాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.. రైల్వే నెట్‌వర్క్‌లోని 100 రూట్లలో మొత్తం 102 వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.