చండీగఢ్ ఎయిర్‌పోర్టులో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను.. విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ సస్పెన్షన్, అరెస్ట్ చేయడం తీవ్ర దుమారానికి కారణం అయింది. కుల్వీందర్ కౌర్ తనను చెంపపై కొట్టిందని.. అసభ్య పదజాలంతో దూషించిందని కంగనా రనౌత్ ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే కంగనా రనౌత్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. కుల్వీందర్ కౌర్‌ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారం రైతు సంఘాల వరకు పాకడంతో వారు కుల్వీందర్ కౌర్‌కు మద్దతు నిలిచారు. తాము ఆమెకు అండగా ఉంటామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. తన తల్లి రైతు ఉద్యమంలో పాల్గొందని.. అయితే రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ అప్పట్లో కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేయడంతోనే తాను ఆమెను కొట్టినట్లు కుల్వీందర్ కౌర్ వెల్లడించింది.
కంగనా రనౌత్ వివాదంలో కుల్వీందర్ కౌర్‌కు అన్యాయం జరగకూడదని.. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 8, 9 వ తేదీల్లో పంజాబ్‌లోని మొహాలీలో న్యాయ యాత్ర నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు తాజాగా ప్రకటించాయి. ఈ మేరకు చండీగఢ్ సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్జూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వణ్ సింగ్ పందేర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన జరగడానికి గల మొత్తం పరిణామాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని.. కుల్వీందర్ కౌర్‌కు అన్యాయం జరగకూడదని కోరుతూ వారంతా పంజాబ్ డీజీపీ గౌరవ్‌ని కలిసి విన్నవించారు.
ఈ ఘటనలో కుల్వీందర్ కౌర్‌ను సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి.. అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే కుల్వీందర్ కౌర్‌కు సింగర్ విశాల్ దర్గానీ మద్దతు ప్రకటించారు. ఒకవేళ ఆమెకు ఉద్యోగయం పోయినా.. తాను ఉద్యోగం ఇస్తానని చెప్పారు.
చండీగఢ్ విమానాశ్రయంలో కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంప దెబ్బ కొట్టగా.. ఆమెను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే కుల్వీందర్ కౌర్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆమెను సస్పెండ్ చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెను కొట్టినట్లు కుల్విందర్ కౌర్ వెల్లడించారు. రైతు సంఘాల నాయకులు కుల్విందర్ కౌర్‌కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.