వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.15 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు తొలి విడతలో 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో 78 నుంచి 81 మందికి అవకాశం ఉన్నా.. ప్రస్తుతం 50 మంది వరకూ తీసుకున్నట్టు తెలిపాయి. బీజేపీ నుంచి అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, హరదీప్ సింగ్ పూరి, అశ్విని వైష్ణవ్, మనుసుఖ్ మాండవీయా, పియూష్ గోయల్, కిరణ్ రిజుజులు, గజేంద్రసింగ్ షెకావత్, శోభా కరద్లాంజే, గిరిరాజ్ సింగ్, క్యాబినెట్‌లో కొనసాగనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, మనోహర్‌లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్‌లతో పాటు త్రిసూర్ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వీరితో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు చోటుదక్కింది.
తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎన్డీయేలో బీజేపీ తర్వాత ఎక్కువ సంఖ్యాబలం ఉన్న టీడీపీకి రెండు పదవులు దక్కాయి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ హోదా.. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను సహాయ మంత్రి పదవి వరించింది.
వీరితో పాటు జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన నాలుగుసార్లు ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తనయుడు రామ్‌నాథ్ ఠాకూర్‌కు మోదీ మంత్రివర్గంలో చోటుదక్కింది. భారతరత్న కర్పూరీ ఠాకూర్ తనయుడైన రామ్‌నాథ్.. తొలిసారి లాలూ సీఎంగా ఉన్నప్పుడు చెరకు అనుబంధ రంగాల పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. తర్వాత రెండోసారి నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ వరకూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
లోక్ జనశక్తి పార్టీ (ఆర్వీపీ) నుంచి దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్‌కు మంత్రివర్గంలో మోదీ అవకాశం కల్పించారు. తొలుత సినిమాతో కెరీర్ ప్రారంభించిన చిరాగ్.. అక్కడ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎల్జేపీ పగ్గాలు చేపట్టారు. హిందూస్థాన్ అవామీ లీగ్ నేత, బిహార్ మాజీ సీఎం జీతన్‌రామ్ మాంఝీకి ఛాన్స్
ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి 2016 నుంచి మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ (సోనేలాల్)కు చెందిన అనుప్రియా పాటిల్‌కు మూడోసారి మోదీ క్యాబినెట్‌లో చేరుతున్నారు. ఆమె 2021 నుంచి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. యూపీలోని మీర్జాపూర్ స్థానంలో 2014 నుంచి గెలుస్తూ వస్తున్నారు. మోదీ తొలి క్యాబినెట్‌లో 2016 నుంచి 2019 వరకూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామికి మంత్రిపదవి వరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమిగా పోటీచేసిన విషయం తెలిసిందే. తొలిసారి 2006లో బీజేపీ మద్దతుతో సీఎం అయిన కుమారస్వామి.. రెండోసారి 2018లో కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 14 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ జయంతి చౌదరికి క్యాబినెట్‌లో చోటుదక్కింది. ఈయన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు మనవడు.. మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్‌కు కుమారుడు.