అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు(ఆదివారం) సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలిస్తున్నారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెంలోని సీఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. తర్వాత అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓల నివాసం భవనాలు సముదాయాలను సీఎస్ పరిశీలించారు. అనంతరం హైకోర్టు అదనపు భవనాన్ని పరిశీలించారు. పర్యటనలో సీఎస్ తో పాటు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, ఎస్ఈ తదితర ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉన్నారు. క్లియరెన్స్, స్ట్రీట్ లైట్లు, క్లీనింగ్ పై వెంటనే దృష్టి పెట్టాలని సీఆర్డీఏ అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు.