టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్-12న ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. దీంతో ప్రమాణస్వీకార సభా ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. సందర్శకులు, నాయకుల రాకతో ప్రాంగణ ప్రాంతం రద్దీగా మారింది. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో జాతీయ రహదారిపై.. విజయవాడ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే చంద్రబాబు కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన పరిస్థితి. సుమారు గంట నుంచి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి రెండు రోజులు ముందే ఇలా ఉంటే.. అసలు సిసలైన రోజు పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రమాణానికి ముందే పోలీసులు చేతులెత్తేశారనే కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.