ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. మేం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం.. దూరమైనా పరవాలేదు కానీ.. సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కానే కాదు. ఈ ఐదేళ్లలో పీఠం ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. ఇప్పుడు చంద్రబాబును కొత్తగా నేను పొగుడుతున్నానని అనుకోవద్దు. అప్పుడు (2014) సీఎం అయినప్పుడు కూడా రాజమండ్రిలో సభలు పెట్టి.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉంది’ అని స్వరూపానందేంద్రస్వామి చెప్పుకొచ్చారు.