ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలంలోని యర్రపోతవరం లాకులవద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం చేతికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేసిన సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ఆదివారం సాయంత్రం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం కోసం అకతాయిలను అడ్డుపెట్టుకుని కుటిల రాజకీయవాదులు చేస్తున్న చర్యలుగా అభివర్ణించారు. సర్పంచ్ ఇప్పటికే కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం కోసం పనిచేశాడని, మరో వ్యక్తి నాయుడు అనేవానిపై తమకు అనుమానాలు ఉన్నాయని, పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. పోలీసులు అతిత్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ సంఘటనపై రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో పామర్రు ఎస్.ఐ. కె.జానీబాషా కేసు నమోదు చేశారు. డీఎస్పీ రామకృష్ణ, సీఐ దొరరాజు సం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. వేలిముద్రలు సేకరించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నామని, దుండగులని వెంటనే పట్టుకుంటామని ఎస్.ఐ చెప్పారు.