పోలవరం నుంచి తాగునీటిని పంపిణీ చేసే సత్యసాయి మంచినీటి పథకంలో ఆరంభం నుంచి పనిచేస్తున్న కార్మికు లకు తరచూ జీతాల బకాయిల సమస్య వేధిస్తూనే ఉంది. గతంలో ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్వహణా బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయక ఎల్‌అండ్‌టీ కంపెనీ సత్యసాయి కార్మికులకు జీతాల బకాయిలు చెల్లించ కుండానే నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. జీతాలు ఇవ్వకపోయినా ఒక ఏడాది ప్రజల మంచినీటి సమస్యల కోసం ఓపికగా సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికులు పనిచేశారు. అయినా ప్రభుత్వం బిల్లులు చేయక పోవడంతో 2020 నుంచి 2022 వరకూ ఏడాదిపాటు జీతాల బకాయిల కోసం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు. గత కొన్నినెలల క్రితం అధికారులు కొంతమేర సమస్య పరిష్కరించి వేరే కాం ట్రాక్టరుకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రభుత్వం బిల్లులు చేయక పోవడంతో ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్టరు కూడా చేతులె త్తేసే పరిస్థితి నెలకొంది. గతేడాదిగా కార్మికులకు జీతాల బకాయిలు చెల్లించడం లేదని ఆరంభం నుంచి చేస్తున్న ఉద్యోగాలు వదులుకోలేక వడ్డీలకు అప్పులు చేసి ఇల్లు గడుపుతున్నామని ప్రభుత్వం స్పందించి జీతాల బకాయిలు ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు.