పాడేరులో మోదకొండమ్మ ఉత్సవ సందడి నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ అలంకరణ, వివిధ ప్రదర్శనలు భక్తుల్లో ఉత్సాహం నింపాయి. అంబేడ్కర్ కూడలి వద్ద నలువైపులా ఏర్పాటుచేసిన ప్రత్యేక లైట్లు, ఎల్‌ఈడీ బోర్డులు కనువిందు చేస్తున్నాయి. అలాగే విశాఖపట్నం వెళ్లే మార్గం, మెయిన్ బజార్, శతకంపట్టు, ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గంలో ఏర్పాటుచేసిన విద్యుత్ అలంకరణలు, అంబేడ్కర్ కూడలి వద్ద అయోధ్య ఆలయం, కోల్‌కతా కాళికా ఆలయం నమైనా లైటింగ్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే జెయింట్ వీల్, ప్లే జోన్‌లోనూ విద్యుత్ వెలుగులు జిగేల్‌మంటున్నాయి. అలాగే సాయంత్రం వేళలో ఏర్పాటు చేస్తున్న గరగర నృత్యం, కేరళ ఓనం బ్యాండ్, దేవతామూర్తుల వేషాల ప్రదర్శనలు అలరిస్తున్నాయి. పట్టణ వీధుల్లో అధిక సంఖ్యలో జనం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ కుటుంబాలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొట్టగుళ్లి రామారావు, ప్రధాన కార్యదర్శులు టి.ప్రసాదరావునాయుడు, వై.శ్రీను, కె.వెంకటరమణ, సభ్యులు వి.రాజబాబు, డి.బాబూరావు, వి.వెంకటరత్నం, ముకుందరావు, ఎస్.శ్రీనివాసకుమార్, తదితరులు పాల్గొన్నారు.