రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు చొరవ చూపారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు అన్నారు. ‘ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. దీన్నొక కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పదవి వచ్చిందని విర్రవీగితే ఇదే పరిస్థితి వస్తుంది. ఇదే సమయంలో తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే, అది అలవాటుగా మారుతుంది. అయితే, విధ్వంస, కక్షా రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో తన కుటుంబానికి అవమానం జరిగిందని టీడీపీ అధినేత గుర్తుచేశారు. ‘గౌరవ సభ కాదు, రవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడతా అని చెప్పా. నా శపథాన్ని ప్రజలు గౌరవించారు. అలాంటి ప్రజలను నిలబెట్టాలి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.