నవ్యాంధ్ర ప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు (జూన్12) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్ వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. విజయవాడలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా మూడు పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా హాజరయ్యారు. వీరందరికీ వేదికపై కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేకంగా కుర్చీని సిద్ధం చేశారు. ఇక వేదిక మీదకు వచ్చే సమయంలో ఈ విషయాన్ని చంద్రబాబు గమనించారు. వెంటేనే సిబ్బందితో ఈ విషయాన్ని చెప్పారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీలు ఉండాలని.. అంతా సమానమేనని వారికి స్పష్టం చేశారు. వెంటనే ఆ కుర్చీని తీసి వేయించి.. మిగతా వారికి వేసిన కుర్చీనే ఉంచాలని సూచించారు. దీంతో సిబ్బంది ప్రత్యేక కుర్చీని వేదికపై నుంచి తీసివేసి.. మిగతావారికి ఏర్పాటు చేసినటువంటి కుర్చీని ఏర్పాటుచేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ శ్రేణులు ఈ వీడియోను షేర్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజనం.. చంద్రబాబు సింప్లిసిటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే బాబుగారి సంస్కారం ఇదంటూ టీడీపీ శ్రేణులు, అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి.. మున్ముందు కూడా కలిసికట్టుగా ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో టీడీపీ సొంతంగా మెజారిటీ సాధించడంతో కూటమిలో ఐక్యత ఇలాగే ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. అధికారాన్ని కైవసం చేసుకోవటానికి 88 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా.. టీడీపీ ఏకంగా 135 చోట్ల గెలుపొందింది. దీంతో ఎన్నికల తర్వాత కూడా టీడీపీ, బీజేపీ, జనసేన ఐక్యత కొనసాగుతుందా అనే సందేహాలు నెట్టింట వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో కూటమిలో ఎవరూ ఎక్కువ.. ఎవరూ తక్కువ కాదనే సంకేతాలు ఇస్తూ చంద్రబాబు ఈ విధంగా చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమిని నడిపించాల్సిన చంద్రబాబు.. తన చర్య ద్వారా పార్టీ శ్రేణులకు, నేతలకు కూడా ఓ రకంగా ఈ సందేశాన్ని ఇచ్చారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సమావేశంలోనే ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును మూడు పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా.. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమర్థించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబును తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.