తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా ఘనంగా స్వాగతం పలికారు. అయితే విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి బయల్దేరారు. ఇంతలో ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్‌కు దగ్గర పరుగులు తీశారు.. ఏం జరుగుతుందో తెలియక సెక్యూరిటీ సిబ్బంది కంగారుపడ్డారు.. ఆమె మాత్రం ఆగకుండా.. చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీశారు.
ఆ మహిళను కారులో నుంచి గమనించిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ను ఆపారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు.. ఆమె చంద్రబాబును ఆప్యాయంగా పలకరించారు.. తాను మదనపల్లి నుంచి వచ్చినట్లు చెప్పారు. తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానన్నారు. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో.. చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడారు.. సెక్యూరిటీని వారించి మరీ ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తమ కష్టం ఫలించి.. తమ కోరిక మేరకు 'మీరు సీఎం అయ్యారు సార్' అంటూ ఆమె ఒక్కసారిగా.. 'మీ కాళ్లు మొక్కుతాను' అన్నారు. చంద్రబాబు ఆమెను సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చాను అని నందిని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లమ్మా అంటూ సున్నితంగా అక్కడి నుంచి పంపించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.. అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు విజయవాడలో ఏ కనెక్షన్ లో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా.. పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు.. అనంతరం కూటమి ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కూటమి ఎమ్మెల్యేల సంతకాలతో లేఖను అచ్చెన్నాయుడు, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌కు లేఖ ఇచ్చారు.. కొద్దిసేపటి గవర్నర్ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూటమి నేతల్ని గవర్నర్ ఆహ్వానించారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ముందడుగు పడింది. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.