ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల తర్వాత ఆసక్తికరంగా మారాయి.. కూటమికి 164 సీట్లతో పట్టం కట్టిన ప్రజలు.. వైఎస్సార్‌సీపీ కేవలం 11 సీట్లకు పరిమితం చేయడం సంచలనమనే చెప్పాలి. కూటమి సునామీలో ఎంతోమంది వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు ఓడిపోయారు.. ఈ దారుణమైన పరాజయం నుంచి ఆ పార్టీ నేతలు బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీచేసిన కేశినేని నాని కూడా తమ్ముడి చిన్ని చేతిలోదారుణంగా ఓడిపోయారు. ఈ క్రమంలో కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
కేశినేని నాని నిర్ణయంపై వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'అయ్యగారి ఐరన్ లెగ్గు మహిమ.. ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్.. జనాల కోరిక మన్నించి ఇంకొన్ని రోజులు ఆ పార్టీలోనే పడుంటే నీ లెగ్గు పుణ్యమా అని ఆ పార్టీ 11 నుంచి 1 అయ్యేది కదయ్యా కేశినేని నాని' అంటూ సెటైర్లు పేల్చారు. అంతేకాదు ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి పీవీపీ కేశినేని నానిని టార్గెట్ చేశారు. 'బెజవాడలో 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన కేశినేని నానికి ఘనంగా పౌర సన్మానం ఏర్పాటు చేద్దాం' అంటూ ఎద్దేవా చేశారు.
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి తన నిర్ణయాన్ని తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన నేతలు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తాను అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించానని.. రెండుసార్లు తనను ఎంపీగా గెలిపించి సేవ చేసే అవకాశం దక్కినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.. ఇది ఓ అపురూపమైన గౌరవం అన్నారు. ఇంతకాలం తనకు మద్దతిచ్చిన వారికి ధన్యావాదలు తెలిపారు. తాను రాజకీయాలకు దూరమవుతున్నా.. విజయవాడ అభివృద్ధి విషయంలో తన నిబద్ధత అలాగే ఉందన్నారు. తాను విజయవాడ మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు కేశినేని నాని.
కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరుఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఆ పార్టీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి.. తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేటర్‌గా గెలిచారు.. అయితే వైఎస్సార్‌సీపీలోకి వెళ్లే ముందు ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మరి శ్వేత రాజకీయ భవిష్యత్‌పై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.. ఆమె కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లేనని చర్చ జరుగుతోంది.