ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చిన చంద్రబాబు.. మన రాజధాని అమరావతి అని ప్రకటించారు. ఆర్థిక రాజధాని విశాఖపట్నం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్న ఆయన.. విశాఖను ఆధునిక నగరంగా తీర్చుదిద్దుతామని ప్రకటించారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నానన్న చంద్రబాబు.. ఈసారి సీఎం కావడం ఎంతో ప్రత్యేకమన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు.. తనను ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్న సందర్భంగా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తన ప్రసంగంలో పదే పదే పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు.. మరో భాగస్వామ్య పక్షమైన బీజేపీ పేరును కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. గత పదేళ్లలో మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్న చంద్రబాబు.. ఎన్డీయే 3.0 హయాంలో దేశం మరింత ముందుకెళ్తుందని.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతుందన్నారు.
చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో కేంద్ర మంత్రిగా ఇటీవలే ప్రమాణం చేసిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. నరసాపురం ఎంపీగా మరోసారి పోటీ చేయడానికి రఘురామ కృష్ణరాజు తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆయితే బీజేపీ అధిష్టానం మాత్రం నరసాపురం సీటు కోసం పట్టుబట్టింది. ఈ స్థానం నుంచి అనూహ్యం ఓ సాధారణ కార్యకర్త అయిన వర్మను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చంద్రబాబు తెలిపారు. తర్వాత ఆరా తీయగా.. వర్మ చాలా ఏళ్లుగా బీజేపీ కోసం బలంగా పని చేస్తున్నాడని తెలిసిందన్నారు.
పార్టీ కోసం పని చేసే కార్యకర్తను గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. టీడీపీ, జనసేన సైతం పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను గుర్తిస్తున్నాయని ఈ సందర్భంగా బాబు తెలిపారు. వర్మకు ఎంపీ టికెట్ ఇవ్వడమే బాబును ఆశ్చర్యపరిచిందంటే.. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి కట్టబెట్టడం కూడా ఆశ్చర్యానికి గురి చేసే ఉంటుంది. అంటే చంద్రబాబును బీజేపీ అధిష్టానం రెండుసార్లు సర్‌ప్రైజ్ చేసిందన్నమాట. ఒక్క చంద్రబాబునే కాదు.. నరసాపురం వర్మ విషయంలో ఏపీ ప్రజలందర్నీ బీజేపీ పెద్దలు సర్‌ప్రైజ్ చేశారనే చెప్పొచ్చు.