ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుకను యథావిధిగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్న సమయంలో.. విద్యా కానుకను పంపిణీ చేస్తారా లేదా అని కన్ఫ్యూజన్ మొదలైంది. దీంతో వెంటనే స్పందించి విద్యాకానుకపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13 నుంచి స్కూళ్లు ప్రారంభంకానుండటంతో.. ఆ రోజు నుంచే విద్యా కానుక పంపిణీ మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు విద్యా కానుకపై క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో కిట్లను పంపిణీ చేసేందుకు ఇప్పటికే సిద్ధం అయ్యారు.. ఈలోపు ప్రభుత్వం మారడంతో క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది.
అంతేకాదు కొత్త ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. విద్యాకానుక విషయంలో అవినీత జరిగిందని.. ఈ మేరకు విచారణ చేయాలని భావిస్తోంది. ఈ ఐదేళ్లలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.. నాణ్యతలేని బ్యాగులు, బూట్లు కొనుగోలు చేశారనే విమర్శలు వచ్చాయి. తమకు కావాల్సిన కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు టెండర్ల విధానం మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది విద్యా కానుక కిట్లకు సంబంధించి టెండర్లను ఎత్తివేసినట్లు చెబుతున్నారు. కాంట్రాక్టర్లతో చర్చించి తక్కువకు ఇస్తామన్న వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశాలపై ప్రభుత్వం విచారణ చేయనుంది.
మరోవైపు నూతన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది స్కూళ్లు ఒకరోజు (జూన్ 13న) ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది.. అయితే ఒక రోజు వాయిదా వేశారు. నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం ఉంది.. దీంతోరాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు.. గురువారం స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు.