రేయ్.. మాధవ్.. నిన్ను చంపుతాం అంటూ టీడీపీ నాయకులు, ఊరొదిలి వెళ్లిపోవాలంటూ పోలీసు అధికారులు నిన్నటి వరకు ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌పై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున అనంతపురం నగరంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ‘రేయ్ మాధవ్ నిన్ను చంపుతాం’ అంటూ కేకలు వేస్తూ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికి వారం అవుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులపై అధికార పార్టీ నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా, నిన్నటి వరకు ఎంపీ అయిన మాధవ్‌నే ఊరొదిలి వెళ్లిపోవాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేయడం గమనార్హం. అయితే, ఇందుకు మాధవ్ ససేమిరా అంటున్నారు. కార్యకర్తలకు అండగా ఇక్కడే ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు.