ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేనకు మూడు, బీజేపీక ఒక మంత్రి పదవి దక్కింది. మంత్రివర్గంలో 17 మంది తొలిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉండటం విశేషం.
అయితే చంద్రబాబు మంత్రివర్గంలో లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే ప్రముఖంగా బీజేపీ నేత పేరు వినిపిస్తోంది. బీజేపీ నేత, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్‌కు బంపరాఫర్ దక్కింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే ఆయన మంత్రి కావడం విశేషం. అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిసారే మంత్రులు అయిన వారు ఈ కేబినెట్లో చాలా మంది ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్, టీడీపీ ఎమ్మెల్యే సవిత ఇలా వీరంతా.. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే వీరికి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు తేడా ఉంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సత్యకుమార్ యాదవ్ కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించారు. 2018లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఇంఛార్జిగా పనిచేశారు. అయితే ఏపీ రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ విచిత్రంగా జరిగింది. ఏపీలో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరటంతో.. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ను ఆయన దక్కించుకున్నారు. ఎన్నికలకు కేవలం 40 రోజుల ముందు ఆయనకు టికెట్ ఖరారు కాగా.. ఈ ఎన్నికల్లో చక్రం తిప్పి.. సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి షాక్ ఇచ్చారు.
తన రాజకీయ వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్ సాయంతో నియోజకవర్గానికి వచ్చిన 40 రోజుల్లోనే కేతిరెడ్డిపై సంచలన విజయం అందుకున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ 12 రౌండ్ల వరకూ వెనుకంజలో ఉన్న సత్యకుమార్.. ఆ తర్వాత రౌండ్, రౌండ్‌కు ఓట్ల తేడాను తగ్గించుకుంటూ వెళ్లారు. చివరి రౌండ్లలో కేతిరెడ్డిపై ఆధిక్యంలోకి వెళ్లిన సత్యకుమార్ యాదవ్.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 3 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్‌కు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది.
ఢిల్లీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలతో గెలిచిన మొదటిసారే మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి, విజయవాడ సౌత్ నుంచి గెలిచిన సుజనా చౌదరి, విశాఖ నార్త్ నుంచి విజయం సాధించిన విష్ణుకుమార్ రాజు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్లు మంత్రివర్గం కూర్పు ముందు వినిపించాయి. అయితే వీరందరినీ కాదని సత్యకుమార్‌ను మంత్రిపదవి వరించింది. ఆ రకంగా గెలిచిన తొలిసారిగా మంత్రిపదవి చేపట్టనున్నారు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్..