చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి, భీమగానిపల్లి, బోడేవారిపల్లె సచివాలయాలకు, వెల్‌నెస్ సెంటర్లకు, ఆర్‌బీకెలకు, ఆర్‌వో ప్లాంటుకు, నాడు–నేడు స్కూల్ ప్రారంభించేందుకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్న శిలాఫలాకాలను గునపాలతో ధ్వంసం చేశారు. దీంతో సచివాలయ కార్యదర్శులు భయంతో పరుగులు తీశారు. అలానే బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో సచివాలయంలోని శిలాఫలకాలు, సంక్షేమ పథకాల బోర్డులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. శిలాఫలకాలు తొలగించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవని ఎంపీడీవో రాజేష్ చెప్పారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రెచ్చగొడుతూ శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరి మండలం తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల ఫలకాన్ని గురువారం టీటీడీ నాయకులు, కార్యకర్తలు తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్ పూశారు. ఈ ఘటనపై స్థానిక వైయస్ఆర్‌సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.