అగ్నిప్రమాదంలో చనిపోయిన 45 మంది భారతీయుల మృతదేహాలను కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. మంగాఫ్ నుంచి బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చికి.. అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకోనుంది. అగ్రి ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటే కువైట్‌కు వెళ్లిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. అదే విమానంలో వస్తున్నారు. ఈ మేరకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. విమానం కోచికి చేరుకోనుండటంతో అక్కడ నుంచి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్‌లను సిద్దం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
మృతదేహాలను స్వస్థలాలకు తరలించి, వారి కుటుంబసభ్యులకు అందజేయనున్నారు. బుధవారం మంగాఫ్ నగరంలో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 33 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదం జరిగిన ఆరు అంతస్తుల భవంతిలో 175 మంది భారతీయ కార్మికులు ఉంటున్నట్టు తెలిసింది. మృతుల్లో అత్యధింగా 23 మంది కేరళవాసులు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ముగ్గురు, ఒడిశా ఇద్దరు, బిహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, హరియాణా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
బుధవారం రాత్రే కువైట్ వెళ్లిన కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున రూ.2 లక్షల ఆర్ధిక సాయం ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ రూ.5 లక్షల చొప్పున, రవి పిళ్లై రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.