ఇటీవల వెలువడిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో.. 25 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న సిక్కిం డెమోక్రటిక్ పార్టీని మట్టికరిపించి.. సిక్కిం క్రాంతికారి మోర్చా - ఎస్‌కేఎం పార్టీ ఘన విజయం సాధించింది. 32 స్థానాలకు గానూ ఏకంగా 31 సీట్లలో గెలిచి.. తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌కేఎం పార్టీ అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇదే ఎన్నికల్లో ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణకుమారి రాయ్ కూడా పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె రాజీనామా చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తన ఎమ్మెల్యే పదవికి.. కృష్ణకుమారి రాయ్ గురువారం హఠాత్తుగా రాజీనామా చేశారు. అయితే ఈనెల 2 వ తేదీన విడుదలైన ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన కృష్ణకుమారి రాయ్.. బుధవారమే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ తర్వాతి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇక కృష్ణకుమారి రాయ్ చేసిన రాజీనామాకు.. ఇటీవల ఎన్నికైన స్పీకర్ ఎంఎన్ షెర్పా వెంటనే ఆమోదం తెలిపారు.
ఇటీవల జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణకుమారి రాయ్.. నంచిసింగితాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ - ఎస్‌డీఎఫ్ అభ్యర్థి బిమల్ రాయ్‌ని కృష్ణకుమారి రాయ్ ఓడించారు. ఇక ఈ వ్యవహారంపై సిక్కిం క్రాంతికారీ మోర్చా పార్టీ అధికార ప్రతినిధి బికాష్ బస్నెట్ స్పందించారు. ఆమె భర్త, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, ఎస్‌కేఎం పార్టీ అంగీకారంతోనే కృష్ణకుమారి రాయ్ రాజీనామా చేసినట్లు తెలిపారు. నంచిసింగితాంగ్ నియోజకవర్గం కోసం గత కొన్నేళ్లుగా ఆమె పనిచేస్తున్నారని.. సామాజిక కార్యకర్త అని వెల్లడించారు.
ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వెళ్లిన సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్.. తన భార్య కృష్ణకుమారి రాయ్ రాజీనామాపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. పార్టీ సంక్షేమం, లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ ఏకగ్రీవ నిర్ణయంతో కృష్ణకుమారి రాయ్ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తనతో పాటు కృష్ణకుమారి రాయ్ కూడా ప్రజాసేవలో పూర్తిగా అంకితమవుతారని.. నంచిసింగితాంగ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని.. అక్కడ ఎన్నికైన కొత్త అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఇక ఈ ఎన్నికల్లో ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సోరెంగ్ చాకుంగ్, రేనాక్ స్థానాల్లో పోటీ చేసిన ప్రేమ్ సింగ్.. రెండింటిలో విజయం సాధించారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సిక్కింలో రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు అనివార్యం కానున్నాయి.