లోక్‌సభ ఎన్నికల సమయంలోనే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రచారం జరిగింది. ఆమెకు రాయబరేలీ లేదా అమేథీ నుంచి టిక్కెట్ ఇస్తారనే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ, ఆమె మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ప్రియాంక ఎప్పుడొస్తారా? అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. త్వరలో వారి ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఈ సారి మాత్రం లోక్ సభకు ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో వాయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నుంచి పోటీచేసి విజయం సాధించిన రాహుల్ గాంధీ.. ఒక స్థానానికి రాజీనామా చేస్తారు. ఆయన వాయనాడ్ సీటును వదులుకుంటారని పార్టీ వర్గాలు సూత్రప్రాయంగా వెల్లడించాయి. ఆ స్థానంలో సోదరి ప్రియాంక గాంధీని పోటికి చేయించాలని భావిస్తున్నారని తెలిపాయి.
ఇక, 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాందీ.. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆమెకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అదంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. తర్వాత 2022 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ప్రియాంక.. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధినంటూ ఒకానొక సందర్భంలో అన్నారు. కానీ, తర్వాత ఆ మాటలను వెనక్కి తీసుకున్న ఆమె.. ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు.
రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ రాజ్యసభ నామినేట్ కావడంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ దాదాపు ఖరారయ్యిందనే ప్రచారం జోరుగా సాగింది. రాయబరేలీ నుంచి ప్రియాంక.. అమేథీ నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలుస్తారని మీడియా కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకోవాలని తోబుట్టువులను కోరారని, ఇద్దరూ పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల బరిలో పోరాడకుంటే కార్యకర్తలకు కాంగ్రెస్ మిత్రపక్షాలతో ఎన్‌డీఏకు తప్పుడు సందేశం పంపినట్లవుతుందని ఆయన చెప్పినట్టు పేర్కొన్నాయి.
కానీ, ప్రియాంక పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. తను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే.. బీజేపీ ఆరోపిస్తున్నట్టు వారసత్వ రాజకీయాలను నిజం చేసినట్టు అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కానీ, 2019 ఎన్నికల్లో అమేథీని కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి మాత్రం గాంధీ కుటుంబానికి విధేయుడ్ని పోటీకి నిలిపి కంచుకోటలో జెండా ఎగురవేసింది. భారీ మెజార్టీతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిశోరీలాల్ శర్మ విజయం సాధించారు. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమి 43 చోట్ల విజయం సాధించగా.. భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ 33 సీట్లకే పరిమితమైంది.
ఇక, రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని వదులుకోవాలనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. తన తుది నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని మాత్రమే చెబుతూ జాతీయ రాజకీయాల్లో యూపీ ఉన్న ప్రాధాన్యత కారణంగా రాయబరేలీతో కలిసి వెళ్లడం దాదాపు ఖాయమని వర్గాలు తెలిపాయి. ‘దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వయనాడ్‌లో ఉంటారని ఊహించలేం.. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం బాధపడకూడదు. ప్రతి ఒక్కరూ దానిని అర్థం చేసుకోవాలి.. ఆయనకు మద్దతు అందించాలి’ అని కేరళ కాంగ్రెస్ నేత సుధాకరన్ అన్నారు.