"స్పందన" కార్యక్రమం పేరును "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్"గా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనల స్వీకరణకు స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టమ్ పేరునే పునరుద్ధరిస్తూ టీడీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌ల పరిశీలన కోసం గత చంద్రబాబు ప్రభుత్వం ప్రజావేదిక నిర్మించింది. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావేదికను కూల్చివేశారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తామంటూ హడావిడి చేసి.. ఐదేళ్లపాటు అది ప్రారంభించకుండానే కాలయాపన చేశారు. స్పందన రివ్యూలతోనే అప్పటి జగన్ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఈ కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దీంతో త్వరలో రాష్ట్రస్థాయి నుంచి కిందిస్థాయి వరకూ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్‌ను చంద్రబాబు సర్కార్ పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకురానుంది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మోమోలు జారీ చేశారు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టమ్ అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.