ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కేశవ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో యనమలను కలవడం ఆసక్తికరంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా యనమలకు విశేష అనుభవం ఉండడంతో పలు సూచనలు, సలహాల కోసం కలిసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఆర్థికశాఖ కీలకం కావడంతో దాని నిర్వహణనకు సంబంధించి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నూతన మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.