ఎన్నికల ముందు ప్రకటించిన హామీల్లో ఐదింటిని అమలు చేస్తూ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఐదు సంతకాలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని, ప్రజల పట్ల ఉన్న అంకితభావాన్ని నిరూపించుకున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ తెలిపారు. చంద్రబాబు కార్యదక్షతకు ఇది నిదర్శనమని చెప్పారు. సీఎం తొలి ఐదు సంతకాలతో ప్రయోజనం పొందే లబ్ధిదారులు, ఆయా వర్గాల ప్రజలతో కలిసి శుక్రవారం పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ మెగా డీఎస్సీ ద్వారా 16,3467 ఉద్యోగాల భర్తీకి సంతకం చేయడమేగాక వెంటనే జీవో జారీ చేశారని, డిసెంబర్‌లోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారన్నారు. అవ్వతాతలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల మొత్తాన్ని రూ.4వేలకు పెంచడమే కాకుండా జూలై నెలలో బకాయిలతో కలిసి రూ.7వేలు ఇవ్వనున్నారని తెలిపారు. రైతుల ఆందోళనలతో ఏకీభవిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ మరో సంతకం చేశారని చెప్పారు. ప్రజల తరపున చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో టీడీపీ పట్టణ కన్వీనర్ కొండేపూడి సూర్యప్రకాష్, నాయకులు పిల్లి చిన్నా, బర్ల అప్పారావు, పడాల అప్పారావు, కొరుప్రోలు శ్రీను, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కొర్ని రమణ, మేరుగు భూషణం పాల్గొన్నారు.