ఉమ్మడి చిత్తూరు జిల్లాలో షర్మిల ప్రచార సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని తాజా ఎన్నికలు నిరూపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓట్లు పెరగడం తప్ప ఏ నియోజకవర్గంలోనూ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధులకు దక్కలేదు. ఏపీ న్యాయ్ యాత్ర పేరుతో జిల్లాలో ఏప్రిల్ 15న కార్వేటినగరం, పలమనేరు, బంగారుపాళ్యం ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. అంతకుముందు నగరిలోనూ ప్రచారం చేశారు. ఆమె పర్యటించిన ప్రాంతాల్లో ప్రజల నుంచి ఆదరణ కూడా లభించింది. దీంతో ఆమె ప్రభావం ఈసారి జిల్లాలో ఉంటుందని అంతా భావించారు. వైసీపీ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థులు చీల్చుతారని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందారు. కానీ జిల్లాలో ఎక్కడా అటువంటి పరిస్థితే లేదు. చిత్తూరు ఎంపీ స్థానం విషయానికొస్తే.. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజగోపాల్‌కు 16572 ఓట్లు, 2019లో పోటీ చేసిన రంగప్పకు 24643 ఓట్లు పోలయ్యాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగపతికి 30150 ఓట్లు పడ్డాయి.. అంటే స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. అలాగే జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. 2014లో 16442 ఓట్లు, 2019లో 16201 ఓట్లు, తాజా ఎన్నికల్లో 23241 ఓట్లు పోలయ్యాయి. అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటటే 7040 ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పెరిగాయి.