ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన సంఘటన దర్శిలో జరిగింది. పుట్టినరోజు పార్టీ సందర్భంగా ఈ విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. దర్శి మండలం లంకోజనపల్లి పంచాయతీలోని లూదగిరి కాలనీకి చెందిన బొందల నవీన్(16), కొనకనమిట్ల మండలం వాగుమడుగు గ్రామానికి చెందిన వి.చందు(16) దర్శి ఎన్‌ఏపీ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి గురువారం సాయంత్రం గల్లంతయ్యారు. ఈ విషయం రాత్రి పొద్దుపోయిన తర్వాత కుటుంబసభ్యులకు తెలిసింది. వీరిరువురు దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మార్చిలో పదో తరగతి పరీక్షలు రాశారు. ఇద్దరు మంచి స్నేహితులు. లూదగిరి కాలనీకి చెందిన నవీన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం పార్టీ ఇచ్చేందుకు తన స్నేహితులను అందరినీ పిలుచుకున్నారు. అందులోభాగంగా చందును కూడా పిలిచాడు. చందు స్వగ్రామమైన వాగుమడుగులో తిరునాళ్ల ఉత్పవాలు జరుగుతున్నాయి. కురిచేడు మండలం అలవలపాడులో ఉన్న చందు అమ్మమ్మను ఊరికి తీసుకెళ్లేందుకు ఆ గ్రామానికి వెళ్లి దర్శికి తీసుకొచ్చాడు. స్నేహితుడు నవీన్ పుట్టినరోజు పార్టీ ఉండటంతో ఆమెను బస్సు ఎక్కించి పంపి గురువారం మధ్యాహ్నం దర్శిలోని శివరాజ్‌నగర్ వద్ద గల ఎన్‌ఏపీ చెరువు వద్ద పుట్టినరోజు పార్టీ చేసుకున్నారు. భోజనాలు అనంతరం సాయంత్రం నవీన్, చందులు ఈత కొట్టేందుకు చెరువులో దిగారు. మిగిలిన విద్యార్థులు ఈత రాదని వెళ్లిపోయారు. వారిద్దరు ఈత కొట్టేక్రమంలో నీటమునిగారు. రాత్రి 9గంటల వరకు విద్యార్థులు ఇళ్లకు చేరకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది ఆరా తీశారు. పుట్టినరోజు పార్టీ చేసుకున్న సమాచారం తెలుసుకొని అక్కడకు వెళ్లి గాలించారు. శుక్రవారం ఉదయం ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు. ఈ సంఘటన ఇరుగ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొల్పింది.