అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కలకలంరేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి మర్డర్ మిస్టరీ వీడింది. కన్న తండ్రిని కుమార్తే దారుణంగా హతమార్చినట్లు తేలింది. పోలీసుల దర్యాప్తు సంచలన విషయాలు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లెకు చెందిన దొరస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన కుటుంబంతో కలిసి మదనపల్లె ఎగువకురవంకలో స్థిరపడ్డారు. దొరస్వామి దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో.. ఆయన కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు.. ఆమె బీఈడీ చదవింది. దొరస్వామి ఈ నెల 30న ఆయన ఉద్యోగ విరమణ కూడా చేయనున్నారు.
దొరస్వామి రిటైర్ కాబోతుండటంతో కూతురు హరితకు వివాహం చేద్దామని సంబంధం చూశారు.. అయితే ఆమె తనకు ఇష్టం లేదని చెప్పింది. పెళ్లి విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. గురువారం తెల్లవారుజామున దొరస్వామి ఇంట్లో నిద్రపోతుండగా.. హరిత తండ్రి తలపై చపాతి కర్ర, ఇనుప అట్టతో కొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడగా.. పెద్దగా కేకలు వినపడటంతో చుట్టుపక్కల జనాలు వచ్చారు. వెంటనే ఆయన్ను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటానా స్థలాన్ని పరిశీలించారు.. అయితే హరిత తండ్రి జారిపడి ప్రాణాలు కోల్పోయారని నమ్మించే ప్రయత్నం చేసింది.
పోలీసులకు ఆమె మీద అనుమానం రావడంతో ప్రశ్నించారు.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అసలు నిజం చెప్పింది.. ఆమె తండ్రిన హతమార్చినట్లు తేలడంతో.. హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి మామ కుమారుడు డాక్టర్ నారాయణయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మదనపల్లెలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. ముందు అనుమానాస్పద మరణంగా భావించినా.. ఆ తర్వాత హత్యగా తేలింది.
ఈ హత్యకు ప్రేమ వ్యవహారం కారణమే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరిత ఓ యువకుడిని ప్రేమిస్తూ అతడికి భారీగా డబ్బులు ఇచ్చిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం దొరస్వామికి తెలియడంతో.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మందలించి పంపింనట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి తండ్రి తనకు వేరు పెళ్లి చేస్తారనే భయంతో హరిత, ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాదు దొరస్వామిపై హరిత ఒత్తిడి తెచ్చి ఇంటిని తన పేరు మీదకు రాయించుకున్నట్లు తెలుస్తోంది.. దాని విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందంటున్నారు. ఈ కేసులో హరిత ప్రియుడి పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.. అతడిని కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.